HMDA | జగద్గిరిగుట్ట మార్చి 25: పేరేమో బంగారం అంటగట్టేది ఏమో తగరం అన్నట్టుంది జగద్గిరిగుట్టలో హెచ్ఎండీఏ అభివృద్ధి పనుల తీరు. జగద్గిరిగుట్ట- షాపూర్ నడుమ ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలాన్ని ఏడాదిన్నర క్రితం హెచ్ఎండీఏకి కేటాయించారు. ఇంకేముంది ఆధునిక సౌకర్యాలతో ప్లాట్లు వేయడంతో పాటు జగద్గిరిగుట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంతా ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురవుతున్నది. అభివృద్ధి చేసి ప్లాట్లు విక్రయించడం దేవుడెరుగు.. కనీసం స్థలాన్ని ఆధీనంలో ఉంచుకునే చర్యలు కూడా సరిగ్గా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
హెచ్ఎండీఏకు కేటాయించిన సుమారు 20 ఎకరాల్లో ఆరు నెలలుగా మట్టి పోసే పనులు మాత్రమే సాగాయి. ఉన్నతాధికారుల పట్టింపు లేకుండా ఓ గుత్తేదారుకు పనులు అప్పగించడంతో అడ్డగోలుగా వ్యర్థాలు తీసుకొచ్చి నింపుతున్నారు. అక్రమ నిర్మాణంలో కూల్చిన మట్టిని ఇక్కడ తీసుకొస్తూ వాటితోనే చెత్తాచెదారం కలిసి ఉంటున్నది. హెచ్ఎండీఏ అన్న పేరు హద్దురాళ్లలో తప్ప పనుల్లో కనిపించడం లేదు. హైడ్రా వ్యర్థాల ముసుగులో ట్రాక్టర్ కు రూ 300, టిప్పర్ కు రూ 500 వసూలు చేశారు. కాగా, అక్రమాలపై ఈ నెల 12న నమస్తే తెలంగాణలో హైడ్రా పేరుతో వసూళ్లు అన్న కథనంతో పారబోతకు అడ్డుకట్టపడింది. అయితే స్థలాన్ని చదును విషయంలో నాణ్యత ప్రమాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. జగద్గిరిగుట్ట నుంచి వచ్చే సగభాగం మురుగునీటి అవుటేట్టు హెచ్ఎండిఏ ప్రాంతంలోనే కలుస్తున్నాయి. మురుగు చిన్నపాటి వాగు తరహాలో ప్రవాహం ఉంటుంది. గతంలోనే మట్టి తరలింపుతో ఏర్పడిన భారీ గోతుల్లో నీరు చేరి భూమంతా వదులుగా తయారైంది. అలాంటి లోతట్టు ప్రాంతంలో తూతూ మంత్రంగా వ్యర్థాలు 20 అడుగుల మేర పోసి చదువు చేశారు. ఈ భూమిలో దృఢమైన పునాదులు వేయాలంటే 20 అడుగులకు పైగా తవ్వితే గానీ సరైన నేల తగలని పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా లే అవుట్‌లోని భూమి దృఢంగా ఉండాలంటే ప్రతి మూడు అడుగుల మేర మట్టి పోసి హైడ్రాలిక్ రోలర్ మిషన్ ద్వారా కంప్రెస్ చేయాల్సి ఉంటుంది. కానీ కబ్జాదారులు భూమిని తూతూ మంత్రంగా పోటీ చేశారు. చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. దీంతో ఇలాంటి స్థలంలో హెచ్ఎండీఏ పేరు చూసి జనాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే ఎంతకాలం నిలుస్తాయన్నది ప్రశ్నార్థకంగానే మారింది.
జగద్గిరిగుట్ట-షాపూర్ మధ్య ఉన్న స్థలాన్ని రక్షించడంలో హెచ్ఎండీఏ అధికారులు మొదట్నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. బస్తీలు అనుకున్న ప్రాంతంలో మాత్రమే కంచె వేసి వదిలేశారు. ప్రధాన రహదారిని అనుసంధానిస్తూ తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేయాల్సి ఉన్న అలాంటిదేమీ చేయలేదు. జగద్గిరిగుట్ట నుంచి షాపూర్ నగర్ వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న స్థలాన్ని కాకుండా లోపలికి ఉన్న భూమిని కొనుగోలు చేయడంపైనా విమర్శలు ఉన్నాయి. బస్తీలు అనుకుని ఉన్న ప్రాంతంలో హెచ్ఎండీఏ కొనుగోలు చేస్తే, రహదారి అనుకున్న స్థలం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ఒకవైపు చెత్త ప్రాసెసింగ్ కేంద్రం, మరోవైపు జంతు సంరక్షణ సంస్థ బ్లూ క్రాస్ సొసైటీకి ఇచ్చిన స్థలాలు కూడా హెచ్ఎండీఏ స్థలానికి అనుకునే ఉన్నాయి. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోయిన నేపథ్యంలో ఇలాంటి చోట ఏమేర కొనుగోలుదారులు ముందుకు వస్తారన్నది ప్రశ్నార్థకమే. స్థలంలోకి వెళ్లే ప్రవేశ మార్గం వద్ద ఎలాంటి గేటు లేకపోవడంతో వ్యర్థాలు పారపోస్తున్నారు. స్థలాన్ని పరిశీలించేందుకు ఎత్తయిన వాచ్ టవర్ ఏర్పాటు చేసినప్పటికీ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇకనైనా సరైన రహదారి ఏర్పాటు చేయడంతో పాటు ఇంజనీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో పనులు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.