Pocharam | పోచారం, మే2: ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలంలో కొందరు అక్రమంగా నిర్మించిన కట్టడాలను శుక్రవారం పోచారం మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ‘ పార్కు స్థలం ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. పట్టించుకోని అధికారులు’ అని నమస్తే తెలంగాణ వెబ్సైట్ (ntnews.com)లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సర్వే నంబర్ 18,19 సత్యసాయి నగర్ కాలనీలో ఉన్న 800 గజాల పార్కు స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 400 గజాల స్థలాన్ని ఆక్రమించారు. ఆ 400 గజాల స్థలం చుట్టూ ప్రహారీ గోడ కట్టి ఒక గదిని కూడా నిర్మించారు. ఈ ప్రాంతంలో గజం స్థలం 30 నుంచి 35 వేలు పలుకుతుంది. ఈ లెక్కన ఆక్రమణకు గురైన పార్కు స్థలం దాదాపు రూ.3.2 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ స్థలంపై మున్సిపాలిటీ అధికారులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయం తాజాగా మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో శుక్రవారం నాడు సిబ్బందితో కలిసి జేసీబీని తీసుకెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.
ఈ సందర్భంగా పోచారం మున్సిపల్ కమిషనర్ వీరా రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి సంబంధించిన ఎలాంటి స్థలాన్ని ఆక్రమించినా సహించేది లేదని తెలిపారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన పార్కు స్థలాలపై మున్సిపాలిటీ కఠినంగా వ్యవహరించి, రక్షిస్తుందని స్పష్టం చేశారు.
Read More : పార్కు స్థలం ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. పట్టించుకోని అధికారులు