పోచారం, ఏప్రిల్25 : పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏకంగా ప్రహారీ గోడ, ఒక రూం నిర్మాణం చేసినా అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని సర్వే నంబర్ 18,19 సత్యసాయి నగర్ కాలనీలో ఉన్న 800 గజాల పార్కు స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు 400 గజాల స్థలాన్ని ఆక్రమించారు. ఆ 400 గజాల స్థలం చుట్టూ ప్రహారీ గోడ కట్టి ఒక గదిని కూడా నిర్మించారు. మిగతా 400 గజాల స్థలం ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో గజం స్థలం 30 నుంచి 35 వేలు పలుకుతుంది. ఈ లెక్కన ఆక్రమణకు గురైన పార్కు స్థలం దాదాపు రూ.3.2 కోట్ల రూపాయలు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ స్థలంపై మున్సిపాలిటీ అధికారులకు స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే కొంత మంది నాయకులు ప్లాటుగా విభజించి ఈ స్థలాన్ని అమ్మివేయడంతో అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల కోసం కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కాలనీ లేఅవుట్లో కూడా ఈ 800 గజాల స్థలం పబ్లిక్ పార్కుగా ప్రత్యేకంగా కేటాయించబడిన స్థలమని, ఇలా పార్కు స్థలం ఆక్రమణకు గురైతే ఈ కాలనీ ప్రజలు విశ్రాంతి కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అధికారులు కల్పించుకొని ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని కాపాడాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.