Cheeriyal | కీసర, మార్చి 19 : గత నాలుగు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో మున్సిపల్ సిబ్బంది వార్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగి బైఠాయించారు. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని చీర్యాల్లోని వార్డు కార్యాలయంలో పనిచేసే మున్సిపల్ సిబ్బందికి గత నెలల నుంచి ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. దీంతో బుధవారం చీర్యాల్ వార్డు కార్యాలయం ముందు మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
తాము చాలీచాలనీ జీతాలతో కాలం వెళ్లదీస్తున్నామని అయినా ఇచ్చే జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరం నుంచి బట్టలు, సబ్బులు, నూనె ఇవ్వడం లేదని అన్నారు. ఈ విధంగా ఇబ్బందులకు గురి చూస్తే తాము ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మున్సిపల్ సిబ్బంది మండిపడ్డారు.