దుండిగల్, ఫిబ్రవరి 23: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంక్షేమ సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆదివారం శంభీపూర్ లోని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించడంతోపాటు పరిష్కరించాలని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
భారత రాజ్యాంగాన్ని 6 తరగతి నుండి 10 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని కోరుతూ కుత్బుల్లాపూర్ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అంబేడ్కర్‌కు నిత్య పూలమాల’ కార్యక్రమం 300 రోజులకు చేరుతున్న క్రమంలో మార్చి 1వ తేదీన సూరారంలోని అంబేడ్కర్ భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా పలు శుభకార్యాలలో పాల్గొనాలని పలువురు ఎమ్మెల్సీ రాజుకు ఆహ్వాన పత్రాలు అందజేశారు.