MLC Shambipur raju | దుండిగల్, మార్చి18 : అధికార పార్టీకి చట్టం చుట్టంగా మారిందా…! భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అలాగే పొందుపరిచారా…? అంటూ శాసనమండలి సమావేశాలలో ప్రశ్నల వర్షం కురిపించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు. ఇవాళ శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశిస్తూ.. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరిట పేరు మార్చి ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో తెలపాలని కోరారు.
అది ఫ్యూచర్ సిటీ అని మంత్రి చెప్తున్నప్పటికీ.. చాలామంది దానిని ఫోర్త్ సిటీ అని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని బయట జనాలు చర్చించుకుంటున్నారని ఎమ్మెల్సీ రాజు పేర్కొన్నారు. దీనికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభ్యంతరం తెలుపగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలుగజేసుకొని అనవసర(అన్ వాంటెడ్ కామెంట్స్) వ్యాఖ్యలను సభలో ప్రస్తావించొద్దంటూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు సూచించారు.
ఇందుకు ప్రతిస్పందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తాను ఎవరి పేరును ప్రస్తావించలేదని, బయట జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే తెలిపానని, పైగా గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి నిండు శాసనసభలో బట్టలు ఊడదీసి కొడతానని వ్యాఖ్యానించినప్పుడు వర్తించని రూల్స్ తనకెలా వర్తిస్తాయన్నారు. ఆ సభలో కనీసం అడ్డు చెప్పని మంత్రులు తాను చేసిన వ్యాఖ్యలకు ఎలా అడ్డు పడతారని ప్రశ్నించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అలాగే రాశారా… ?
అధికార పార్టీలో ఉన్నవారికి ఓ చట్టం, తమకో చట్టం వర్తిస్తుందా..? చట్టమనేది అందరికీ ఒకేలా ఉండాలని, ఇక్కడ అధికార పార్టీకి మాత్రమే చట్టం చుట్టంగా మారిందా…! తమకు(ప్రతిపక్ష పార్టీలకు) మాత్రం ఆంక్షలు ఉంటాయా..? అంటూ ఒకింత ఉద్వేగంగా ప్రసంగించారు. రాజ్యాంగంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అలాగే రాశారా… ? అలా అయితే తాను చేసేది ఏమీ లేదు అంటూ పేర్కొన్నారు.
తాము హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను అప్పుడు వ్యతిరేకించిన ప్రస్తుత అధికార పార్టీ నేతలు దానినే ఫ్యూచర్ సిటీగా ఎలా మలుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏ అవసరం కోసం సదరు స్థలాన్ని ఫ్యూచర్ సిటీగా మారుస్తున్నారు లేదా ఫ్యూచర్ సిటీ కోసం వేరే భూమిని కొనుగోలు చేస్తున్నారా..? భూముల యజమానులకు పరిహారం అందజేస్తున్నారా…! తెలుపాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సమాధానమిస్తూ అందరి సహకారంతో ఫ్యూచర్ సిటీని నిర్మించడంతోపాటు అభివృద్ధి పరచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్