మల్కాజిగిరి, మార్చి 2 : కాలనీల అభ్యున్నతికి తనవంతు తోడ్పాటు అందిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పలు కాలనీలకు చెందిన కాలనీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పలువురు కాలనీల సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. మచ్చబొల్లారం డివిజన్లోని ఏడు కాలనీల డ్రైనేజీ ట్రంక్ లైన్ సమస్యలు, వినాయక్‌నగర్ డివిజన్లోని వెంకటేశ్వరనగర్‌కాలనీ డ్రైనేజీ పైపులైన్లు, ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని సత్య రాఘవేంద్రకాలనీ, లంబాడిబస్తీలో విద్యుత్‌దీపాల సమస్య, ఆర్యూబీ వద్ద సీసీ రోడ్డు, వెంకటాపురం ఖానాజీగూడలో విద్యుత్ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, నేరేడ్మెట్లోని ఓల్డ్పీఎస్ ప్రాంతంలో పోలీసు బందోబస్తు, తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంబంధిత అధికారులతో సమీక్షించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. కాలనీలలో మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.