నేరేడ్మెట్, మే 19: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి యాప్రాల్-కౌకూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మొత్తం రూ.3.71కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలిసి పనులను ప్రారంభించారు. లక్ష్మిపురి కాలనీ, మహాలక్ష్మిపురం, మెహర్బాబాకాలనీ, సాయి క్రిష్ ఎన్క్లేవ్ ఫేజ్ 2 భాను ఎన్క్లేవ్ తదితర ప్రాంతాల్లో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
కౌకూర్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో కొనసాగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఈ పద్మలత, ఈఈ సత్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు జీకే హన్మంతరావు, జేఏసి వెంకన్న, కరంచంద్, శోభ, రమేష్, చిందం శ్రీనివాస్, గొట్ల శివసాయి యాదవ్, లక్ష్మిన్యాదవ్, నిర్ణీత్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.