కుత్బుల్లాపూర్,అక్టోబర్6 : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు, మోసపూరితమైన వాగ్ధానాలకు నిదర్శనమే బాకీ కార్డు అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మోసపూరిత వాగ్ధానాలతోప్రజలను నయవంచనకు గురి చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన బాకీకార్డ్ ఉద్యమంలో భాగంగా చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జీ రాగిడి లక్ష్మారెడ్డిలతో పాటు పార్టీ శ్రేణులతో కలిసి బాకీకార్డులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచరణలో సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న ఆరు గ్యారెంటీలను 700 రోజులైనా పూర్తి చేయని మోసాన్ని ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు గడపగడపకు తిరిగి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.