చర్లపల్లి, సెప్టెంబర్ 28 : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్ పరిధిలోని మారుతినగర్ సంక్షేమ సంఘం నూతన కమిటి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. మారుతి నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వరద ముంప్పుకు గురికాకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
మారుతినగర్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, కాలనీలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సినీయర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు బిక్షపతి, మల్లేశ్‌గౌడ్, కోశాధికారి తాళ్ల శ్రీనివాస్, మధుసూధన్రెడ్డిలతో పాటు కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.