ఉప్పల్ డిసెంబర్ 1 : చిలుకానగర్ డివిజన్లో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత కలిసి డివిజన్ పరిధిలోని కాలనీలలో 1 కోటీ 29 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా బాలాజీ ఎన్క్లేవ్, నార్త్ కళ్యాణపురిలోని ఉద్యాన వనాల్లో వాకింగ్ ట్రాక్, వాచ్మెన్ రూం, చైన్ లింక్ ఫెన్సింగ్, సీసీ కెమరాలు, మొదలగు అభివృద్ధి పనులు, బీరప్ప గడ్డ ప్రాంతంలో పలు కాలనీలలో సీసీ రోడ్లు, బస్తీ దవాఖాన సమీపంలో నూతన డ్రైనేజీ పనులు, సాయిరాంనగర్ కాలనీలో బాక్స్ డ్రైన్ మరమ్మతులు, బొడ్రాయి వెనకాల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. చిలుకానగర్ డివిజన్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నామని, ఇప్పటి వరకు 105 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ వెన్నెలగౌడ్, ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్ధానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.