మేడ్చల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దివ్యాంగులకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో బుధవారం పెరిగిన పింఛన్ల ప్రోసిడింగ్ పత్రాలను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు లేని దివ్యాంగులు డబుల్ బెడ్రూమ్ల (Double Bed Room) కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో దివ్యాంగుల శేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
దివ్యాంగులతో పాటు వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ఆసరా (Aasara) పింఛన్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా లక్ష 46 వేల 922 మందికి ప్రతి నెల వివిధ రకాల పింఛన్లను అందిస్తుందని పేర్కొన్నారు. వీటిలో 21, 863 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు.
పెరిగిన పింఛన్‌తో ప్రతి నెల రూ. 8 కోట్ల 78 లక్షలను ప్రభుత్వం దివ్యాంగులకు పింఛన్ల ద్వారా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి పద్మజారాణి , దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణిత, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్మన్ పావని తదితరులు పాల్గొన్నారు.