Prajavani | మేడ్చల్, మార్చి10(నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు మోక్షం లభించడం లేదు. ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే ఫిర్యాదులను చేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో నామమాత్రంగానే నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేకపోవడంతో జిల్లా కలెక్టరేట్‌కు మళ్లీ మళ్లీ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సుమారు వందకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు వీలు ఉంటే పరిష్కరించాలని, పరిష్కరం కాని ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించినప్పటికీ జిల్లా అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. దీంతో వేలాది సంఖ్యలో ఫిర్యాదులకు మోక్షం లభించడం లేదని తెలుస్తోంది.
అధికారులపై అదనపు కలెక్టర్ సీరియస్
ప్రజావాణిలో మళ్లీ మళ్లీ అవే దరఖాస్తులు వస్తుండటంపై మేడ్చల్ మల్కాజిగిరి అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులే మళ్లీ రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరం కాని ఫిర్యాదులపై ఫిర్యాదుదారులకు సమస్యను పూర్తిగా వివరించాలని అధికారులకు అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష సమావేశాలు నిర్వహించాలి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పరిష్కరం కాని ఫిర్యాదులు అనేకం ఉన్నందున్న ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. దీనికి తోడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పాల్గొంటే జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండే అవకాశం ఉంటుందని, ఫిర్యాదుల పరిష్కరానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఈ రోజు జరిగిన ప్రజావాణిలో 55 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి స్వీకరించారు.