మేడ్చల్, ఏప్రిల్ 18 : వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న 61 పంచాయతీల్లో మొదట 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనం కాకుండా ఉన్న పంచాయతీల్లోని కార్మికులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.
వేతనాలు రాక వెతలు
మేడ్చల్, శామీర్‌పేట, ఘట్కేసర్, కీసర మండలాల్లోని 33 పంచాయతీలను సమీప మున్సిపాలిటీలను మేడ్చల్, తూంకుంట, ఘట్కేసర్, పోచారం, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఈ పంచాయతీల్లో విలీనమైన గ్రామ పంచాయతీల కార్మికులకు వేతనాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తర్వాత ఎల్లంపేట, ఆలియాబాద్, మూడుచింతలపల్లిలను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ మిగతా 28 పంచాయతీలను విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఉందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ అధికారంగా నిర్ణయం మాత్రం వెలుపడలేదు.
ఆందోళన బాట
మున్సిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల్లోని కార్మికులు వేతనాలు ఇబ్బంది లేకపోయినప్పటికీ మిగితా పంచాయతీల్లో రెండు నుంచి ఆరు నెలల వరకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. మేడ్చల్ మండలం నూతన్‌కల్‌లో ఆరు నెలలుగా వేతనాలు రాకపోవడంతో పంచాయతీ కార్మికులు పనులు మాని, పంచాయతీ కార్యాలయంలో వంటావార్పుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లంపేటలో నాలుగు నెలలుగా వేతనాలు రాలేదు. వారు పనులు మానేసి, ఆందోళన బాట పట్టారు. అలాగే డబిల్పూర్, శ్రీరంగవరం, బండమాదారం, రాజబొల్లారం, రావల్కోల్, రావల్కోల్ తండా, రాజబొల్లారం తండా పంచాయతీల్లో వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారు. శామీర్‌పేట, మూడుచింతపల్లి మండలాల్లో ఉన్న పంచాయతీల్లోని ఆలియాబాద్‌లో 3, లాల్గడిమలక్పేటలో 4, మజీద్పూర్లో ఐదు, లక్ష్మాపూర్‌లో మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఆందోళన చేస్తున్నారు.
తలెత్తుతున్న సమస్యలు
వేతనాలు రాక పంచాయతీ కార్మికులు ఆందోళనకు దిగి, పనులను మానేశారు. దీనివల్ల ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య, నీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. వీధులన్నీ చెత్తతో దర్శనమిస్తున్నాయి. చెత్త ఎక్కడికక్కడ పెరిగిపోతుంది. నీళ్లు సరఫరా చేసే వారు లేక నల్లాల్లో నీళ్లు రావడం లేదు. దీంతో ప్రజలు నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆలియాబాద్, లాల్‌గడిమలక్‌పేట తదితర పంచాయతీల్లో ఇప్పటికే నీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు. కొన్ని రోజుల్లో మిగితా పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్య, డ్రైనేజీ, మంచినీళ్ల సమస్యలు తలెత్తతున్నాయి.