మేడ్చల్ కలెక్టరేట్, మే 30 : సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా రేషన్ బియ్యం అందించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. రేషన్ షాపుల్లో మూడు నెలలకు సరిపడే సన్నబియ్యం ఒకేసారి పంపిణీపై రేషన్ డీలర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, డీలర్లను ఆదేశించారు. రేషన్ షాపులు ఉదయం, సాయంత్రం తప్పక సమయపాలన పాటించాలని సూచించారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, ఇతర వసతులను కల్పించాలన్నారు. లబ్ధిదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా చూడాలని, సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.