Disclosure Day Trailer | హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ 79 ఏళ్ల వయసులో కూడా తనదైన మార్కు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో అందరిని షాక్‌కి గురిచేస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “డిస్క్లోజర్ డే” (Disclosure Day). ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ గురువారం విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
‘ఈటీ’, ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’, ‘ఏఐ’ వంటి ఆల్-టైమ్ క్లాసిక్స్ తర్వాత స్పీల్బర్గ్ మళ్లీ ఏలియన్స్ నేపథ్యమున్న కథను ఎంచుకోవడం విశేషం. ఈ చిత్రంలో ఎమిలీ బ్లంట్ వాతావరణంకి సంబంధించిన విషయాలను చెప్పే రిపోర్టర్‌గా నటిస్తుండగా, ప్రభుత్వం రహస్యంగా దాచిన గ్రహాంతరవాసుల నిజాలను ప్రపంచానికి వెల్లడించే క్రమంలో ఎదురయ్యే ఉత్కంఠభరిత పరిణామాలను ఈ సినిమా చూపించనుంది. ముఖ్యంగా ట్రైలర్లో లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ సమయంలో ఎమిలీ బ్లంట్ అదృశ్య శక్తుల ప్రభావానికి గురయ్యే సన్నివేశాలు హారర్ మరియు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తున్నాయి.
జురాసిక్ పార్క్ రచయిత డేవిడ్ కోయెప్ కథ అందించిన ఈ సినిమాకు దిగ్గజ సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. డార్క్ టోన్, మిస్టరీ అంశాలతో నిండిన ఈ చిత్రం 2026, జూన్ 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. స్పీల్బర్గ్ మార్కు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ మరియు సస్పెన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.