Hyderabad | పీర్జాదిగూడ ఏప్రిల్ 8: హైదరాబాద్ బోడుప్పల్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని అతని స్నేహితుడే దారుణంగా హత్య చేశాడు. జిమ్‌లో ఉండగా డంబెల్స్‌తో కొట్టి చంపాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
బోడుప్పల్ కళానగర్ కాలనీకి చెందిన ఏర్పుల సాయి కిశోర్ (34), చంటి ఇద్దరూ స్నేహితులు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కిశోర్ మీద కక్ష పెంచుకున్న చంటి.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కిశోర్‌కు చెందిన జస్ట్ ఫిట్ జిమ్‌కు వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు స్నేహితులను తీసుకెళ్లాడు. అక్కడ మళ్లీ గొడవ జరగడంతో చంటి జిమ్‌లో ఉన్న డంబెల్ తీసుకుని కిశోర్ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
చంటి దాడిలో తీవ్రంగా గాయపడిన కిశోర్‌ను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కిశోర్ మరణించాడు. దీంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చంటిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన ముగ్గురు స్నేహితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా, వివాహేతర సంబంధమే ఈ హత్యకు గల కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.