దుండిగల్,డిసెంబర్22 : జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సూపర్మాక్స్ పరిశ్రమలో జరిగిన దొంగతనంపై ప్రభుత్వం సమగ్రవిచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.మల్లికార్జున్ డిమాండ్ చేశారు. సూపర్మాక్స్ పరిశ్రమలో కోట్లాది రూపాయల విలువైన మిషనరీ దొంగతనానికి గురైన నేపథ్యంలో సోమవారం కుత్బుల్లాపూర్ మండలం సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ ప్రధానగేటు ముందు సీఐటీయూ నేతలు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ 2022 జూలై నుండి 2023 డిసెంబర్ వరకు పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు 18 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. తదనంతరం 2024 నుండి పరిశ్రమను పూర్తిగా మూసివేసిన యాజమాన్యం వందలాది మంది కార్మికుల పొట్టగొట్టిందన్నారు. ఫలితంగా ఇప్పటివరకు సుమారు 50 మంది సూపర్మాక్స్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లోనే ఎన్సీఎల్టీ, ఐఆర్టీ సూపర్మాక్స్ను తమ ఆధీనంలోకి తీసుకుందని, అయినప్పటికీ కార్మికులకు ఎటువంటి సెటిల్మెంట్ జరుపకుండానే కోట్లాదిరూపాయల విలువైన మిషనరీని దొంగతనంగా తరలించిందని ఆరోపించారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి దోశులను గుర్తించి,వారిపై కఠన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దేవదానం,మండల నాయకులు లక్ష్మణ్, పసుల అంజయ్య, కే.శీను, కార్మికనేతలు ఈశ్వరయ్య, ఐఎస్,రావు, లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.