Chamakura Mallareddy | ఘట్కేసర్, ఏప్రిల్ 18: బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినోళ్లకు మురికి గుంటలో పడ్డట్టు అయిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రజతోత్సవ సభ పోస్టర్‌ను శుక్రవారం ఆయన అవిష్కరించారు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా తీర్చిదిద్ది ప్రజల కల సాకారం చేసిన అభివృద్ధి ప్రధాత కేసీఆర్ తమ నాయకుడిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చామకూర మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే హవా ఉంటుందని అన్నారు. తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఒక్క హామీని అమలు చేయలేక చేతులేత్తేసినట్లు విమర్శించారు.
తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, విద్యుత్ సరఫరా సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రుణమాఫీ లేదని, రైతు బంధు పత్తాలేదని, పించన్లు రావటం లేదని అన్నారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పినట్లు చెప్పారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్లలేక మొహం చాటేసే పరిస్థితి నెలకొందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరోనా టైంలో కూడా లేని కష్టాలు వచ్చినట్లు చెప్పారు. నేడు రాష్ట్ర మొత్తం దివాళా తీసిందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్‌ను తరిమి కొట్టడం ఖాయమన్నారు.