GHMC | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 10: కూకట్పల్లి నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ అధికారుల అసమగ్ర విధానాలతో భవన నిర్మాణదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలను, భవనాలను సీజ్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని హెచ్చరించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషనల్ సీసీపీ, కూకట్పల్లి జోనల్ అధికారుల దృష్టికి భవన నిర్మాణదారుల సమస్యలను తీసుకెళ్లి వినతి పత్రాన్ని అందించారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో 50 కి పైగా భవనాలను సీజ్ చేయడం బాధాకరమని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడలేని విధంగా కూకట్‌పల్లిలోనే అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం సరికాదని హితవుపలికారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో సర్కిల్లో… ఒక్కో విధానం అమలు చేయడం సరికాదని అన్నారు. కేపీహెచ్‌బీ కాలనీ కాలనీ పక్కన ఉన్న గోకుల్ ప్లాట్స్‌లో ఒకరకంగా.. బాలాజీ నగర్ డివిజన్ పక్కన ఉన్న అయ్యప్ప సొసైటీలో ఒక రకంగా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గంలో అక్రమ నిర్మాణం అంటూ ఏకంగా భవనాన్ని సీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కనీసం అనుమతులు కూడా లేకుండా పక్క సర్కిల్లో నిర్మాణాలు చేపడుతున్నా చూసి చూడకుండా వదిలేస్తున్నారని.. కూకట్పల్లి నియోజకవర్గంలో మాత్రం సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు. అనుమతులకు మించి చేపట్టిన నిర్మాణాలను మాత్రమే సీజ్ చేయాలని , అనుమతి ఉన్న ఫ్లోర్లను సీజ్ చేయడం సరికాదని అన్నారు. జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లలో ఒకే విధమైన పద్ధతులను అనుసరించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం ఉద్యమిస్తానని హెచ్చరించారు. అధికారులు డబ్బులు తీసుకొని కూడా భవనాలను సీజ్ చేస్తున్నారని, వసూళ్ల కోసం టీంలను ఏర్పాటు చేసుకొని నిర్మాణదారులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు. నిర్మాణదారుల బాధను అర్థం చేసుకోవాలని సీజ్ చేసిన భవనాల సీజ్‌ను తొలగించాలని కోరారు. అదనపు అంతస్తులకు మాత్రమే సీల్ వేసేలా ఆదేశాలు జారీ చేయాలని, అనుమతుల మేరకు నిర్మించిన భవనాలను వినియోగించుకునేలా చూడాలని కోరారు.