బాలానగర్, ఏప్రిల్ 5 : స్వాతంత్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాలానగర్ నర్సాపూర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న మూడు జంటలకు ప్రోత్సాహక బహుమతులు(రూ.2.5లక్షల చొప్పున) అందజేశారు.
ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. కుల రహిత సమాజం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని అన్నారు. జగ్జీవన్ రావ్ సుదీర్ఘ కాలం పాటు కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.