MLA Krishna Rao | కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 25: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శుక్రవారం కూకట్పల్లి క్యాంప్ ఆఫీస్‌లో డివిజన్ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ నినాదమైన ప్రత్యేక రాష్ట్ర సాధనను ప్రపంచ నలుమూలల చాటిచెప్పి.. దేశ పాలకులను మెప్పించి.. ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ రజిత ఉత్సవ పండుగకు ప్రజలు ఉవ్వెత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాలనలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత తొలి సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ.. డప్పు వాయిద్యాలతో తెలంగాణ జెండాలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభకు భారీగా తరలి రావాలని కోరారు. డివిజన్ల వారిగా కోఆర్డినేటర్లు బస్సులను, తాగునీటిని, ఆహార వసతిని సమకూర్చాలని, రూట్ మ్యాప్‌ను వివరించి, ప్రజలను ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.