హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ఒకవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సంస్థను కాపాడాలని కార్మికులు పోరాడుతుంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నది. కేంద్ర ప్రభు త్వం నుంచి వచ్చే ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకే ఇవ్వాలని, సబ్సిడీ ధరలతో ఆర్టీసీతోనే కొనుగోలు చేయించాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల ఆధిపత్యం నుంచి ఆర్టీసీని బతికించాలని డిమాండ్ చేస్తూ.. ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చిన కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆందోళన జరుగాల్సిన 24 గంటల ముందే.. ప్రైవేట్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 1,085 బస్సుల సరఫరాకు అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులకు కేటాయిస్తున్న బడ్జెట్ నుంచే.. వాటిని కొనుగోలు చేసి, ఆర్టీసీలకు దామా షా పద్ధతిలో కేటాయించాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులను ఆర్టీసీలకు ఇచ్చినవిధంగానే, ఎలక్ట్రిక్ బస్సులనూ ఇవ్వాలని కోరుతున్నాయి. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిని రద్దుచేసి, ఆర్టీసీ స్వయంగా ఆ బస్సులను కొని, నడుపుకోవడానికి వీలుగా ఈ పథకంలో సవరణలు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలు అమలుచేస్తున్నదని విమర్శిస్తున్నాయి. కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు ఇచ్చి, వారికే సబ్సిడీ ఇచ్చి, ఆర్టీసీలను నిర్వీర్యం చేస్తున్నా.. ఇక్కడి యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ వ్యతిరేకించ డం లేదని మండిపడుతున్నారు. విద్యుత్తు బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీలకు సర్వాధికారాలు అప్పగిస్తున్నదని కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్‌ల పేరుతో హైదరాబాద్‌లోని సుమారు 10 డిపోలను ప్రైవేట్ సంస్థలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని చెప్తున్నారు. దీంతోపాటు తెలంగాణలోని కరీంనగర్-2, వరంగల్-2, నిజామాబాద్-2, సూర్యాపేట, నల్లగొండ, మెదక్ డిపోల్లో కూడా ఈవీ బస్సులే పాగా వేశాయి. ఒక్క వరంగల్-2 డిపోలోనే సుమారు 115 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. కరీంనగర్-2 డిపోలో 90, నిజామాబాద్-2 డిపోలో సుమారు 60 బస్సులు మొత్తంగా ఈ మూడు డిపోల పరిధిలోనే సుమారు 280-300 వరకూ ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి.
వీటితోపాటు సూర్యాపేట డిపో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుల మయంగా మారింది. మెదక్‌లో కొన్ని బస్సులు తిరుగుతుండగా.. ఒక్క హైదరాబాద్‌కే 2,800 బస్సులను తెప్పించేందుకు రంగంసిద్ధమైంది. ఇప్పటికే 10 డిపోలను తమ ఆధీనంలోకి తీసుకోగా.. మరో 4 డిపోలను ఆక్రమించే పనిలో పడింది. మొత్తంగా హైదరాబాద్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌లో ప్రస్తుతం 810 ఈవీ బస్సులు నడుస్తుండగా.. ఇప్పుడు హైదరాబాద్‌కు 1,085 రానున్నాయి.
ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన అనుమతులతో డిపోలతోపాటు రూట్లను కూడా ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు సంస్థలు స్వాధీనం చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న అత్యధిక రూట్లలోనే ఎలక్ట్రిక్ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ప్రయాణికులు కూడా ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గుతున్నది. బాగా రద్దీగా ఉండే రూట్లలో ఆర్టీసీకి పోటీగా ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుండటంతో.. ఆర్టీసీ ఆ రూట్లలో బస్సులను పూర్తిస్థాయిలో తిప్పడం లేదని అంటున్నారు.
దీంతో కొన్ని డిపోలు, గ్యారేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారని, ఆ డిపోల నుంచి వందలాది మంది సిబ్బందిని బలవంతంగా గెంటివేస్తున్నారని కార్మిక సంఘం నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు ప్రైవేట్ సంస్థలకు ఎలక్ట్రిక్ బస్సులు తిప్పినందుకు కిలోమీటర్‌కు రూ.58-60 మధ్యలో ఆర్టీసీ చెల్లిస్తున్నదని.. ఇలాగైతే సంస్థ లాభాల బాట ఎలా పడుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ స్టేషన్ల పేరుతో ఆర్టీసీకి చెందిన స్థలాల్లోనే ప్రైవేట్ ఈవీ బస్సుల సంస్థలకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రెడ్‌కార్పెట్ పరిచింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, మియాపూర్-2, కంటోన్మెంట్, హయత్‌నగర్, రాణీగంజ్, దిల్సుఖ్నగర్, రాజేంద్రనగర్, మిధా ని, బండ్లగూడ, జీడిమెట్ల డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల స్టాండింగ్ తీసుకుంటుండగా.. వాటిల్లోనే ఆ బస్‌ల కోసం చార్జింగ్ పాయింట్‌తో స్థలాన్ని ఆక్రమించారు. వీటితోపాటు మెహిదీపట్నం, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం, ఫలక్‌నుమా డిపోలను కూడా ఇదే పద్ధతిలో వారికి కట్టబెట్టేందుకు యాజమాన్యం, ప్రభుత్వం సిద్ధమైంది.
ఇప్పటికే ఉన్న 10 చార్జింగ్ స్టేషన్లతో కలిపి మరో 19 ఈవీ స్టేషన్లను ఎలక్ట్రిక్ బస్సుల కోసం సిద్ధం చేస్తున్నారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 25, సూర్యాపేట-2, సంగారెడ్డి, నల్లగొండలో ఈవీ స్టేషన్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్ల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు.
ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గోను కేవలం నెలకు రూ.3 కోట్లు చెల్లించే ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అప్పగించాయి. 10-15 ఏండ్లపాటు కార్గో సేవలు ‘అవేజీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ దక్కించుకున్నది. అత్యంత రహస్యంగా ప్రక్రియను ముగించడంలో యాజమాన్యం సఫలీకృతమైంది.
తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులతో సుమారు 18వేల మందికిపైగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీల సిబ్బందిపై వేటు పడుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఆర్టీసీని వదిలి మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన దుస్థితిని ఆర్టీసీ కార్మికులు ఎదుర్కోబోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా క్రమక్రమంగా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్‌పరం అవుతుందని తాము చెప్తున్నా.. ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి, ఆర్టీసీ సంస్థ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయని మండిపడ్డారు.
డిపోలు, రూట్లు, చార్జింగ్ పాయింట్లు అన్నీ ప్రైవేట్‌కే ఇస్తే.. ఇక ఆర్టీసీకి ఏం మిగులుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎక్కడో అవసరమైన చోట కండక్టర్లను తీసుకుంటున్నారే తప్ప మొత్తం వారి డ్రైవర్లు, వారి క్లీనర్లు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల రాకతో ఆర్టీసీ గ్యారేజీలు ప్రశ్నార్థకంగా మారాయని, ప్రభుత్వం తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఎలక్ట్రిక్ బస్‌ల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే.. మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)కి ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్) 1,085 బస్సులను సరఫరా చేయనున్నది. ఈ మేరకు ఒలెక్ట్రా సంస్థకు ఆర్టీసీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. పీఎం ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా పర్యావరణ అనుకూల ఇంధన, విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) ఆధ్వర్యంలో ఈ లేఖను జారీ చేసింది. ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ ఓజీఎల్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్తు వాణిజ్య వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ తయారు చేసే బస్సులను ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఓజీఎల్ సరఫరా చేసే బస్సులను హైదరాబాద్ నగరంలో తిప్పనున్నారు. ఆర్టీసీ సంస్థకు ఒలెక్ట్రా 12 మీటర్ల పొడవున్న లో-ఫ్లోర్ బస్సులను సరఫరా చేస్తుంది.
ఇందులో ఏసీ, నాన్-ఏసీ బస్సులున్నాయి. స్థానిక రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. బస్సు ముందు, వెనుక భాగంలో ఆధునిక ఎయిర్ సస్పెన్షన్ వ్యవస్థతో ఒకసారి చార్జ్ చేస్తే 250 కిలోమీటర్లకుపైగా ప్రయాణించవచ్చు. సుమారు 45 నిమిషాల్లో ఆపర్చునిటీ చార్జింగ్ సౌకర్యం ఈ బస్సుల్లో ఉన్నది. ఈ బస్సుల్లో దివ్యాంగులకు ప్రత్యేక స్థలం కేటాయించారు.
దేశవ్యాప్తంగా 3,600కిపైగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టిన ఒలెక్ట్రా చేతిలో ప్రస్తుతం 10 వేల విద్యుత్తు వాహనాల ఆర్డర్ ఉన్నట్టు సంస్థ ఎండీ మహేశ్‌బాబు తెలిపారు. దేశ విద్యుత్తు వాహన రంగం లో తమ ప్రయాణానికి ఇది ఒక కీలక మైలురాయి అని చెప్పారు. ఆర్టీసీతో కలిసి సమర్థవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.