బడంగ్పేట్, ఫిబ్రవరి 23: బాలాపూర్ మండలం బడంగ్పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 110 స్థలం విషయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 110లో 16 ఎకరాల స్మశాన వాటిక స్థలం ఉంది. శ్మశాన వాటిక స్థలంలో సేవాలాల్ జయంతి చేసుకుంటామని కొంతమంది గిరిజన సంఘాల నాయకులు స్థానిక తహశీల్దార్ ఇందిరాదేవికి వినతి పత్రం అందజేశారు. ఎలాంటి నిర్మాణాలు చేయమని లేటర్ రాసి ఇవ్వాలని తహశీల్దార్ కండిషన్ పెట్టారు. ఎలాంటి నిర్మాణం చేయమని గిరిజనులు లేటర్ రాసి ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఎలాంటి అనుమతి లేకుండా రాత్రికి రాత్రి సేవాలాల్ గుడి నిర్మాణం మొదలు పెట్టారు.
ఈవిషయం స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తహశీల్దార్ ఇందిరాదేవి, డిప్యూటీ తహశీల్దార్ మహిపాల్ రెడ్డి, ఆర్ఐ జమిల్, ప్రశాంతి, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి రావడంతోనే గిరిజన సంఘాల నాయకులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో రెవెన్యూ అధికారులు మీర్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దీని వెనుకాల ఓ అధికార పార్టీ నేత ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు సేవాలాల్ పేరు మీద గుడి ఎలా కట్టనిస్తారని కుల సంఘాల నాయకులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.