డెక్కన్ సిమెంట్.. రెండేండ్లుగా రాష్ట్రంలో అనేక వివాదాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలు.. ఈ-టెండర్ల ప్రక్రియలో అడ్డదారులు.. అటవీ భూమి ఆక్రమణలు.. తుపాకీతో బెదిరింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ దందాల జాబితా ఇంతటితో ఆగిపోలేదు. డెక్కన్ సిమెంట్‌పై వచ్చిన ఆరోపణల గుట్టు తేల్చేందుకు సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ విచారణ చేపట్టింది. సున్నపురాయి గనుల గ‘లీజు’ దందాపైనా సీఈసీ దృష్టిసారించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో సున్నపురాయి మైనింగ్ అక్రమాలతోపాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలకే సున్నపురాయి బ్లాకులు దక్కేలా జరిగిన ఈ-టెండర్ల ప్రక్రియలో డొంక కదిలేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు నియమించిన ‘కేంద్ర సాధికారత కమిటీ’ (సీఈసీ) వీటిపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇంజినీర్ పసుపులేటి సురేశ్‌బాబు సీఈసీకి ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ప్రభుత్వం వాటిపై సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నెల 25న విచారణ చేపట్టేందుకు సీఈసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరో రెండు ఫిర్యాదులపైనా సీఈసీ దృష్టి సారించింది. సామాజిక కార్యకర్త, న్యాయవాది వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులపై సీఈసీ తెలంగాణ ప్రభుత్వానికి రెండు పర్యాయాలు నోటీసులు జారీచేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా మైనింగ్, అటవీ శాఖలను ఆదేశించింది. దీంతో సదరు శాఖలు స్పందిస్తాయా! లేదా? సురేష్‌బాబు ఫిర్యాదుల మాదిరిగానే సరైన సమాచారం ఇవ్వకుండా దాటవేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సూర్యాపేట జిల్లాలో కృష్ణా నది సమీప అటవీ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాల అక్రమ తవ్వకంతోపాటు గనుల లీజుపై కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో నిర్వహించిన ఈ-టెండర్లలో కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్) నిబంధనలను ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) దృష్టి సారించింది. వాస్తవానికి సైదుల్నామా రిజర్వ్ ఫారెస్టులో డెక్కన్ సిమెంట్స్, సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్ అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్టు చాలాకాలం కిందటే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ మేరకు ఇప్పటికీ హైకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారిక కమిటీకి కూడా వీటిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఇంజినీర్ సురేశ్‌బాబు డెక్కన్ సిమెంట్స్ అరాచకాలపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని మైనింగ్, అటవీ శాఖలకు ఆదేశాలు అందాయి. అయినా నిర్ణీత సమయంలో ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో ఈ నెల 25న విచారణలో భాగంగా తమ ముందు హాజరుకావాలని సీఈసీ ఆదేశించింది. సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్ అక్రమ మైనింగ్‌పై సామాజిక కార్యకర్త, న్యాయవాది వెంకట్‌రెడ్డి చాలాకాలంగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన హైకోర్టులో వేసిన కేసు విచారణ కొనసాగుతున్నది.
చాలాకాలంగా రెండు సిమెంట్ కంపెనీల అక్రమ మైనింగ్‌పై కేసులు కొనసాగుతుండటంతోపాటు పదేపదే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఈ-వేలం ప్రక్రియ చేపట్టడంతో వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రిజర్వ్ ఫారెస్టులో ఖనిజ నిక్షేపాలున్న వేలాది ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంతాలను తెలంగాణ గనులు, భూగర్భవనరుల శాఖ బ్లాకులుగా, తిరిగి వాటిని కంపార్ట్మెంట్లుగా విభజిస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ఎంఎండీఆర్ చట్టం ప్రకారం వేలం నిర్వహించే బ్లాకులకు సంబంధించి కంపార్ట్మెంట్లు, డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు (అక్షాంశాలు, రేఖాంశాలు) స్పష్టంగా పేర్కొనాలి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 ఆగస్టులో ఇచ్చిన ఈ-వేలం నోటిఫికేషన్లో ఇవేవీ పేర్కొనలేదు. బిడ్ డాక్యుమెంట్లలో ఎక్కడా కనీసం కంపార్ట్మెంట్లు కూడా పొందుపరచలేదు. అప్పటికే ఏయే బ్లాకుల్లో ఏయే కంపెనీలు అక్రమ మైనింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయో సరిగ్గా అవే కంపెనీలకు, అవే బ్లాకులు ఈ-టెండర్లలో దక్కాయి. సైదుల్నామా బ్లాకులో 421.90 ఎకరాల్లో వేలం లీజు నిర్వహించారు. ఈ పరిధిలోనే డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ ఇష్టానుసారంగా, అనుమతి లేకుండా సున్నపురాయి నిక్షేపాలను అక్రమ మైనింగ్ చేస్తున్నదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ-వేలంలో ఆ బ్లాకు డెక్కన్ సిమెంట్స్‌కే దక్కింది.
సుల్తాన్పూర్ బ్లాకులో వేలం లీజు విస్తీర్ణం 337.76 ఎకరాలు. ఈ పరిధిలో నాగార్జున సిమెంట్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నదనే ఫిర్యాదులు ఉన్నాయి. సరిగ్గా ఈ-వేలంలో ఈ బ్లాక్ మైనింగ్ లీజు నాగార్జున సిమెంట్స్‌కే దక్కింది. ఈ-వేలంలో పొందుపరిచిన మూడోదైన పసుపులబోడు బ్లాక్ పరిధిలో అక్రమ మైనింగ్ ఆరోపణలు లేవు. విచిత్రంగా ఈ బ్లాక్ లీజు వేలానికి ఎవరూ పోటీ పడకపోవడంతో అధికారులు దానిని రద్దు చేశారు. దీంతో ఈ-వేలంలో ఎంఎండీఆర్ చట్టాన్ని ఉల్లంఘించడం వెనుక కారణం అక్రమ మైనింగ్ నుంచి ఆ రెండు సిమెంట్ కంపెనీలను కాపాడేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్టులోని అక్రమ మైనింగ్‌తోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిన అంశంపై న్యాయవాది వెంకట్‌రెడ్డి తొలుత కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ కేంద్రం ఆ ఫిర్యాదును తెలంగాణ ప్రభుత్వానికి పంపి చేతులు దులుపుకొన్నది. దీంతో వెంకట్‌రెడ్డి సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీకి ఫిర్యాదు చేశారు. సీఈసీ నిరుడు డిసెంబరు 18న తెలంగాణ గనులు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది.
ఈ ఫిర్యాదులపై వివరాలు ఇవ్వాల్సిందిగా సీఈసీ ఓసీస్డీ వీకే పంతరి ఆదేశాలు జారీచేశారు. ఈ నెల 6న కూడా రెండోసారి నోటీసులు ఇచ్చారు. ఇదే సమాచారాన్ని ఫిర్యాదుదారు వెంకట్‌రెడ్డికి అందించడంతో ఆయన స్వయంగా గనులు, అటవీ శాఖకు వెళ్లి మరోసారి తన ఫిర్యాదులను అందించారు. ఈ నేపథ్యంలో వీటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఈసీకి వివరాలు పంపుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వివరాలు పంపకపోతే ఇంజినీర్ సురేశ్‌బాబు ఫిర్యాదుపై చేపట్టిన విచారణ మాదిరిగానే తన ఫిర్యాదులపైనా సీఈసీ విచారణ చేపట్టే అవకాశాలు ఉంటాయని న్యాయవాది వెంకట్‌రెడ్డి తెలిపారు.