Keesara | మహాశివరాత్రి సందర్భంగా కీసరలో నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడోత్సవాలు ఆలస్యంగా ప్రారంభమవ్వడంతో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చీఫ్ గెస్ట్ ఆలస్యంగా రావడంతో ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ క్రీడా పోటీలు మిట్ట మధ్యాహ్నం 1.15కు మొదలుపెట్టారు. అప్పటికే ఎండలో ఎదురుచూసిన క్రీడాకారులు డీలాపడిపోయారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ సహా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి పాల్గొనకపోవడం గమనార్హం.
ఉదయం ప్రారంభం కావాల్సిన క్రీడలు మధ్యాహ్నం ప్రారంభం
కీసరగుట్ట మహాశి వరాత్రి పర్వదినం సందర్భంగా కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడోత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ క్రీడలను నిర్వహించాలి. ఉదయం 10గంటల కల్లా మేడ్చల్ జిల్లాలోనే కాకుండా నగర ప్రాంతాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రాంతాల నుంచి సుమారు 2008 మంది విద్యార్థులు సుమారు 174 టీంలకు సంబంధించిన క్రీడకారులు కీసరగుట్టలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకొన్నారు. ఉదయం 10గంటలకు ప్రారంభించాల్సిన క్రీడలను మిట్ట మధ్యాహ్నం 1.15 గంటలకు ఆలస్యంగా ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నాం వరకు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు డీలా పడిపోయి ఆలసిపోయారు. ఇంతలో 1.15 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటి చైర్మన్ శివాసేనారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మైక్ పట్టుకొని ఆలస్యం అయింది. ఆడుదామా…. తిందామా అంటే విద్యార్థులంతా ఒక్కసారిగా ముక్తకంఠంతో అన్నం తిందాం అని కేకలు వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యార్థులు కాపుకాసి తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ముఖ్యఅతిథి కోసం విద్యార్థులు, పీఈటీలు గంటల తరబడి నిరీక్షించారు.
వెలవెల బోయిన స్పోర్ట్స్ గ్రౌండ్…..కాంగ్రెస్ నేతలు తప్ప అధికారుల జాడ గల్లంతు
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన గ్రామీణ క్రీడోత్సవాలకు వేదిక మీద ఒక్క అధికారి కూడా లేకపోవడం గమనార్హం. ఒక్క మండల విద్యాధికారి శశిధర్ తప్ప ఇతర అధికారులు ఎవరూ కనిపించలేదు. విద్యార్థులు, పీఈటీలు ఒక్క పక్క ఎప్పుడు క్రీడలు జరుగుతాయి ఛీప్ గెస్ట్ ఎప్పుడోస్తాడని వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ వేదిక మీద కాంగ్రెస్ నేతలు తప్ప జిల్లా అధికారులెవ్వరు ఈ ఛాయల్లోకి రాలేదు. ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ ఆయన రాకుంటే జాయింట్ కలెక్టర్లు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు. కాని సోమవారం నిర్వహించిన క్రీడోత్సవాల ప్రారంభం రోజు చీఫ్ గెస్ట్ కోసం ఉదయం నుంచి మధ్నాహ్నం వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
క్రీడలకు రూ.371 కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి
క్రీడల కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.371 కోట్ల రూపాయలు కేటాయించారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివచరణ్‌రెడ్డి తెలిపారు. కీసరగుట్టలో నిర్వహించే క్రీడలు శాంతియుత వాతావరణం మధ్య నిర్వహించుకోవాలని సూచించారు. విద్యార్థులందరు క్రీడల్లో బాగా రాణిస్తే చక్కటి భవిష్యత్ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఆలయ ధర్మకర్తలు, మండల విద్యాధికారి శశిధర్, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పీఈటీలు, పీడీలు తదితరులు పాల్గొన్నారు.