Madhavaram Krishna Rao | కేపీహెచ్బీ కాలనీ, మే 30: కాంగ్రెస్ పార్టీ నాయకుల వేధింపులతో అమాయకులు బలికావడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో డివిజన్ల కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కృష్ణారావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వేధింపుల వల్ల బోరబండ డివిజన్ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడం ఎంతో కలిసి వేసిందని తెలిపారు. గత కొన్ని నెలలుగా సర్దార్ను పలు రకాలుగా వేధిస్తున్నారని, అన్నివైపులా వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండున్నర ఏళ్ల వయసున్న పిల్లలు, భార్య అనాథగా మారడం బాధాకరమని అన్నారు. అమాయకులను వేధిస్తూ రాక్షసుల్లా పీడిస్తున్న ఇలాంటి నాయకులను క్షమించరాదని ప్రజలు కూడా వీరి అరాచకాలను గమనిస్తున్నారని తొందరలోనే వీరి అరాచకాలకు ముగింపు పలికే రోజు వస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి కాంగ్రెస్లోకి వెళ్లిన నాయకులే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని, పీసీసీ అధ్యక్షుడు ఇలాంటి వారిని గమనించాలని కోరారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకుంటే స్వాగతించామని.. కానీ నేడు సోమవారం వచ్చిందంటే చాలు ప్రజావాణికి కాంగ్రెస్ పార్టీ నాయకులే వెళ్లి బిల్డింగులపై ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ.. నిర్మాణదారుల వద్ద డబ్బులు దండుకోవడం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సర్దార్ మృతికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఫతేనగర్ బ్రిడ్జి శిథిలావస్థకు చేయడం వల్లే గతంలో బ్రిడ్జి నిర్మాణం కోసం మాజీ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే బ్రిడ్జి కూలి ఇద్దరికి గాయాలయ్యాయని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బ్రిడ్జి, అండర్పాస్ నిర్మాణ పనులను చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో బ్రిడ్జి వద్ద ప్రజలతో కలిసి ధర్నా చేస్తానని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను వేధిస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకుంటూ ప్రజలకు అండగా నిలబడాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ఎలాంటి అరాచకాలు జరగలేదని, నిరుపేదలకు అండగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో ప్రజలు విసుగెత్తి పోయారని, నిత్యం అందుబాటులో ఉండి వారికి అండగా నిలబడి ధైర్యం చెప్పాలని కోరారు.