శామీర్‌పేట : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పరిస్థితి కథ కంచికేనని జోస్యం చెప్పారు. శామీర్‌పేట మండలంలోని శామీర్‌పేట , బొమ్మరాశిపేట గ్రామాల్లో అర్హులకు ఇంటి స్థలాల పట్టాల (House Sites) ను బుధవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ( Congress ) పని చెల్లని రూపాయిలెక్క మారనుందని విమర్శించారు. రాష్ట్రంలోని పేదలను ఆదుకోవడంతో పాటు వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ఆశయమని అన్నారు. అర్హతలను బట్టి ప్లాట్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు , సంక్షేమ ఫథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాల పట్టాలు పొందిన వారికి గృహలక్ష్మి (Grihalaxmi ) పథకం క్రింద రూ.3 లక్షలు అందజేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఆసరా పింఛన్ ప్రతి ఒక్కరికి అందుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి (Kalyana laxmi) , నిరంతర విద్యుత్, దళితబంధు, గృహలక్ష్మి వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్ ఇవ్వడంతో పాటు దివ్యాంగులకు మరో రూ. వెయ్యి పెంచిందని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు అడిగే అర్హత లేదన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న బీఆర్ఎస్కే ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్లూభాయిబాబు, వైస్ ఎంపీపీ సుజాత, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.