MSG | మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన తాజా ఎంటర్టైనర్ ‘మన శంకరవప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మూడు వారాలు గడిచినా థియేటర్లలో జోరుగా వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్, స్టెప్పులు, యాక్షన్ సీన్స్‌కు తోడు అనిల్ రావిపూడి స్టైల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ చేసింది.చిత్రబృందం అధికారిక ప్రకటన ప్రకారం ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రీజినల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ మూవీ రన్‌ను మరింత బలపరుస్తోంది. పండుగ సీజన్ ముగిసినా థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడం ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను ఓటీటీలో చూడాలనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘మన శంకరవప్రసాద్ గారు’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇది అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీ రిలీజ్ దాదాపు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, శరత్ సక్సేనా తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సంగీత దర్శకుడు భీమ్స్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్నిచ్చాయి. మొత్తంగా చూస్తే థియేటర్లలో రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘మన శంకరవప్రసాద్ గారు’ త్వరలోనే ఓటీటీలోకి రానుండటంతో మెగా అభిమానులు మరోసారి ఈ ఎంటర్టైనర్ను ఇంటి వద్దే ఆస్వాదించేందుకు రెడీ అవుతున్నారు.