ఆదిలాబాద్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. గతంలో ఇతర పార్టీల్లో ఉండి టికెట్లు ఆశించి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లకు టికెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆశావహులకు రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులపై మండిపడుతున్నారు. కొంతమంది మాజీ కౌన్సిలర్ల కు టికెట్లు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, గెలిచే అభ్యర్థులకు కాకుండా డమ్మీ అభ్యుర్థులకు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్లో చేరి తప్పు చేశాం..!
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డులకు 266 నామినేషన్లు దాఖలయ్యాయి. చాలా మంది టికెట్లు దక్కుతాయనే ఆశతో నామినేషన్లు వేశారు. వీరితోపాటు సిట్టింగ్లు కూడా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరి నాయకులు ఇచ్చిన హామీల మేరకు నామినేషన్లు వేశారు. తీరా వారికి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరి తప్పు చేశామని అంటున్నారు. గెలిచే అభ్యర్థులమైన తాము రెండేండ్లుగా ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడడంతోపాటు పార్టీ పటిష్టానికి కృషి చేశామని, అయినా తమకు నాయకులు మొండిచేయి చూపారని వాపోతున్నారు. కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసినా.. బీ-ఫారాలు ఇచ్చే అవకాశం లేనందున ఇండిపెండెంట్గా బరిలో ఉంటామని, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని శపథం చేస్తున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో రెబల్ అభ్యర్థులు తీవ్ర ప్రభావం చూపనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థుల టికెట్ల పంచాయితీ చర్చనీయంశంగా మారింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆశావహులు కొంతసేపటి తర్వాత తొలగిస్తున్నారు.