మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరు పెంచింది. కాంగ్రెస్, బీజేపీల నుంచి కీలక నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండడంతో హుషా రుగా ఉంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడానికి ముందు నుంచే బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. కొత్త నాయకుల రాకతో క్షేత్రస్థాయిలో నయా జోష్‌తో దూసుకుపోతున్నది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై సొంత పార్టీ నాయకులతోపాటు సాధారణ జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్పు కోసం ఓటేస్తే తమ జీవితాలే తలకిందులయ్యే దుస్థితి వచ్చిందన్న భావన పెరిగిపోతున్నది. పైపెచ్చు కష్టపడిన వారికి గుర్తింపులేదన్న భావన కలుగుతున్నది. దీంతో సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలను వదిలి బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం బీఆర్ఎస్లో చేరికల వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో బీజేపీపైనా కూడా అసమ్మతి పెరిగింది. ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీని గెలిపించినా.. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఒరిగిందేమీ లేదు. పోనీ కేంద్రం నుంచి ప్రత్యేక కేటాయింపులు ఏమైనా వస్తున్నాయంటే అదీ లేదు. దీంతో ఆ పార్టీపై అసంతృప్తితో ఉన్న నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సై అంటున్నారు. రెండు జాతీయ పార్టీల నుంచి నాయకుల చేరికతో గులాబీ దళం కొత్త పుంతలు తొక్కుతూ గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నది.
నిర్మల్‌లో భారీగా చేరికలు
నిర్మల్ మున్సిపాలిటీ ఇన్చార్జిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను నియమించడంతో ఆయన బలమైన అభ్యర్థు ల ఎంపికపై దృష్టి సారించి సఫలీకృతమయ్యారు. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలిపారు. బలమైన నాయకులుగా గుర్తింపు పొందిన వారిని పార్టీలో చేర్చుకోవడంతో బలం పెరిగింది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్, బీజేపీల నుంచి పలువురు ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తోపాటు నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. కొన్ని రోజుల క్రితం నిర్మల్‌కు చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షుడు, వరుసగా నాలుగు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికైన అయ్యన్నగారి రాజేందర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ప్రస్తుతం ఈయన 30 వార్డు నుంచి, ఆయన సతీమణి అయ్యన్నగారి మాధవి 40వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అలాగే శుక్రవారం జరిగిన చేరికల్లో నిర్మల్ పట్టణంలోని 31వ వార్డు పరిధిలో గల బోయవాడ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, తాజా మాజీ కౌన్సిలర్ శంకర్పతి బీఆర్ఎస్లో చేరారు. 19వ వార్డు పరిధిలోని మంజులాపూర్ కాలనీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు శంకర్‌యాదవ్ సైతం బీఆర్ఎస్లో చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్‌యాదవ్ బీఆర్ఎస్లో చేరగా, ఈయన 9వ వా ర్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మంజులాపూర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నాయకులు జీ.చిన్నరాజన్న తన అనుచరులు మగ్గిడి రమేశ్, జీ.రాకేశ్లతోపాటు దాదాపు 50 మందితో కలిసి బీఆర్ఎస్లో చేరా రు. వీరితోపాటు కాంగ్రెస్ నుంచి 16వ వార్డుకు చెందిన నిజాం, 17 వార్డుకు చెందిన ఫిరోజ్, 22వ వార్డుకు చెందిన మినాజ్, 35వ వార్డుకు చెందిన మాజీద్‌లు పెద్ద సంఖ్యలో గల తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. వీరందరు ఆయా వార్డుల నుంచి బీఆర్ఎస్ అ భ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరారు. పట్టణంలోని 10వ వార్డు నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు.
కలిసొస్తున్న పొత్తులు..
ఇతర పార్టీల నాయకుల చేరికలతోపాటు చెన్నూర్‌లో సీపీఐ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామంటూ ప్రకటించింది. ఆ మున్సిపాలిటీతోపాటు ఇతర బల్దియాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో లేని దగ్గర లెఫ్టిస్టులు బీఆర్ఎస్కు మద్దతు పలికే అవకాశాలు లేకపోలేదు. దాదాపు రెండు, మూడు మున్సిపాలిటీల్లో ఇది బీఆర్ఎస్కు కలిసిరానున్నది. బీఆర్ఎస్లోకి వలసలు పెరిగిన నేపథ్యంలో హస్తం పార్టీ, కమల దళంలో ఆందోళన పెరిగినట్లు సమాచారం. కొత్త చేరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో గణాంకాలు మారిపోయాయి. ఉమ్మడి జిల్లాలోని పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో గెలుపు దిశగా బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎన్నికల బరిలోకి వెళ్తున్నది. చేరికల నేపథ్యంలో నాయకులు, కార్యకర్తలతోపాటు సాధారణ జనం కారు వైపు చూస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు సరికొత్త వ్యూహరచన చేస్తూ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు.
మంచిర్యాల, చెన్నూర్‌లో హస్తంకు ఎదురుదెబ్బ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీతోపాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీలక నాయకులు ఇటీవల బీఆర్ఎస్లో చేరారు. ముఖ్యంగా చెన్నూర్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం చెన్నూర్ పట్టణానికి చెందిన ఆయన అనుచరులు బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మంత్రి వివేక్‌కు భారీ షాక్ తగిలినట్లు అయ్యింది. చెన్నూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు సన్నగిల్లాయి. ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీలక కాంగ్రెస్ లీడర్లు కారెక్కారు. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్కు సన్నిహితుడిగా పేరున్న అబ్దుల్ సత్తార్ బీఆర్ఎస్లో చేరారు. హాజీపూర్ మండలంలోని గుడిపేట మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరితోపాటు 13, 55వ డివిజన్ల మాజీ కౌన్సిలర్లు పార్టీ మారారు. లక్షెట్టిపేట, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లోనూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లోకి నాయకులు వలస వచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు.