దుండిగల్, మార్చి 24: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారాం 25వ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు జి +2 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తుండగా, మరికొందరు ఏకంగా మునిసిపాలిటీ నుంచి గాని, హెచ్ఎండీఏ నుంచి గాని ఎటువంటి అనుమతులు పొందకుండానే బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి సర్కిల్ కు చెందిన కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సహకరిస్తుండటంతోనే అనుమతులు లేని నిర్మాణాలు విచ్చలవిడిగా వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
అవినీతికి పాల్పడుతున్నారని గ్రేటర్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 27 మంది న్యాక్ ఇంజనీర్లను సోమవారం నాడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి విధుల్లో నుంచి తొలగించారు. అందులో ముగ్గురు న్యాక్ ఇంజనీర్లు ఒక్క గాజులరామారం సర్కిల్ పరిధిలోనే ఉండటం చూస్తుంటే పట్టణ ప్రణాళిక విభాగంలో ఎంతమేర అవినీతి వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని మరో ఇద్దరినీ జీహెచ్ఎంసీ కమిషనర్ విధుల్లోంచి విధుల్లోంచి తొలగించడం సంచలనం సృష్టించింది. అయితే అక్రమ నిర్మాణదారులతో కొందరు సిబ్బంది, అధికారులు మిలాఖత్ అవుతూ వారిచ్చే అమ్యామ్యాలకు ఆశపడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి . స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా బుట్ట దాఖలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో నిర్మాణదారులు కోర్టుకు వెళ్లి స్టేటస్కోలు, నాట్ టు ఎంటర్ ప్రేయర్ ఆర్డర్లు తెచ్చుకోవాలని సలహాలు ఇస్తూ తమ పదం కడుపుకుంటున్నట్లు విమర్శలున్నాయి.
ఇక మరికొందరికి నిర్మాణం బయటవైపు త్వరగా పనులు పూర్తి చేసుకొని రంగులు వేసుకోవాలని అధికారులు సిబ్బంది సలహాలు ఇస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇలా లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుండటంతోనే న్యాక్ సిబ్బందిని జీహెచ్ఎంసీ కమిషనర్ విధుల్లోంచి తొలగించినట్లు సమాచారం. అవినీతికి పాల్పడుతున్న అనే ఆరోపణతో న్యాక్ సిబ్బందిని తొలగించినట్లే అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల పైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని సర్వత్ర అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తద్వారా జీహెచ్ఎంసీకి ఆదాయం కూడా చేకూరుతుందని పలువురు మరోవైపు జీహెచ్ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు ( జీరో పర్మిషన్స్) తీసుకోకుండానే చేపట్టిన నిర్మాణాలతో పాటు, రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ బిల్డింగులను నిర్మిస్తున్న నిర్మాణదారుల నుంచి, అదే సమయంలో జి+2 అనుమతులతో ఐదారు అంతస్తులు నిర్మిస్తున్న నిర్మాణదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.