Hydraa | మల్కాజిగిరి, ఏప్రిల్ 8: హిందూ స్మశాన వాటిక సమస్యను పరిష్కరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మచ్చ బొల్లారంలోని హిందూస్మశాన వాటిక వద్ద ఉన్న డంప్‌యార్డ్‌ను మంగళవారం నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. మచ్చ బొల్లారంలోని హిందూ స్మశాన వాటికలో రాంకీ సంస్థ నిర్వాహకులు డంపియార్డును నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఇటీవల స్మశాన వాటికను డంపింగ్ యార్డ్ గా మారుస్తున్నారని, పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనీవాసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. హిందూ స్మశాన వాటిక డంపు యార్డ్ ని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించినట్లు తెలిపారు. ఇదే సమస్యపై మంత్రి శ్రీధర్ బాబు తనతోపాటు అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
హిందూ స్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ యార్డుగా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని ఏవీ రంగనాథ్ అన్నారు. హిందూ స్మశాన వాటికలో ఎట్టి పరిస్థితులలో డంపింగ్ యార్డ్ తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. డంపింగ్ యార్డ్ కోసం కేవలం రెండెకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని, దాదాపు ఐదెకరాలలో డంపింగ్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. గత 24 రోజులుగా హిందూ స్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకు వచ్చారని అన్నారు. స్థానిక ప్రజలకు డంపింగ్ యార్డ్ మూలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించామని, సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.