Bhu Bharati | కీసర, జూన్ 1: భూ భారతిలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో చాలామంది రైతులు తాము పడుతున్న ఇబ్బందుల గురించి రెవెన్యూ సదస్సులో భారీ ఎత్తున్న దరఖాస్తులు చేసుకున్నారు. కీసర మండలాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి గత నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సులకు జిల్లా కలెక్టర్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, తహసీల్థార్ అశోక్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 13 రెవెన్యూ గ్రామాల నుంచి మొత్తం 1082 దరఖాస్తులను దాఖలు చేసుకున్నారు. వీటిలో భూభారతి కింద 1,056 ఇతర సమస్యలకు సంబంధించి 26 దరఖాస్తులున్నాయి.
భూ సమస్యలను పరిష్కారిస్తామని ధరణి స్థానంలో భూ భారతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కీసర మండలంలో మొత్తం 1056 దరఖాస్తుల్లో కొంతమందికి ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి నేరుగా రెవెన్యూ అధికారులు వారివారి ల్యాండ్‌లోకి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. ఇంకా చాలామంది రైతులకు ఫోన్ సమాచారం రాలేదని చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం 406 దరఖాస్తులకు మాత్రమే డిస్పోస్ చేసిన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.
రెవెన్యూ అధికారులకు వినతిలెన్నో……
కీసర మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో చాలామంది రైతులు తమ తమ భూములకు సంబంధించి ఎన్నో రకాల వినతులను సమర్పించుకున్నారు. మొత్తం 1056 దరఖాస్తులో మిస్పింగ్, రికార్డులకు ఎక్కనివి 412, మ్యూటేషన్ 81, డీఎస్ పెండింగ్ 61, భూ విస్తీర్ణత తేడాలు సరి చేయడం 77, భూ వివరణ స్వభావం 54, పట్టదారు పేరు తండ్రి భర్త పేరు మార్పు 18, పట్టదారు పాసు పుస్తకాలు103, ప్రభుత్వ భూములకు సంబంధించి 42, ఓఆర్సీ 3, 38ఈ ద్రువపత్రం కోసం 16, ఉన్న దాని కంటే ఎక్కువ విస్తీర్ణం 388 మంది రెవెన్యూ సదస్సులో అధికారులకు ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు.
పెద్ద ఆర్భాటం కోసమే భారీ ప్రచారం……
భూ భారతి కింద మొదట పైలెట్ ప్రాజెక్ట్ కింద కీసర మండలాన్ని ఎంపిక చేసి వాటిలో 1056 దరఖాస్తులు స్వీకరించారు. వీటికి సంబంధించి జూన్ 2వ తేదీన ప్రొసీడింగ్ అర్డర్లు ఇస్తామని రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు సదస్సులో రైతులకు హామీలిచ్చారు. సదస్సులు జరిగి నెల రోజులు అవుతున్నా వీటికి మోక్షం లభించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రచారం కోసమే పెద్ద ఆర్భాటాలు ప్రకటనలు చేస్తున్నారని ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.