CPM | దుండిగల్, ఏప్రిల్ 2 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ కరువైపోయిందనీ, ఎవరు పడితే వారు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకుంటున్నారని కుత్బుల్లాపూర్ మండలం సీపీఎం పార్టీ కార్యదర్శి కే లక్ష్మణ్ ఆరోపించారు. చివరికి విద్యాసంస్థల భూములను కూడా వదలడం లేదనీ అన్నారు.
హెచ్సీయూ భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను, సీపీఎం పార్టీ నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా ఇవాళ షాపూర్ నగర్లోని రైతు బజార్ నుంచి సాగర్ హోటల్ చౌరస్తా వరకు సీపీఎం కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొద్దిసేపు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారత దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో హెచ్సీయూ ఒకటనీ అలాంటి యూనివర్సిటీ భూములను గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలం వేసి విక్రయించే ఆలోచనలో ఉందని, యూనివర్సిటీ విద్యార్థులు ఆ భూములను కాపాడుకోవాలని అక్కడ ఉన్న ప్రకృతి ని రక్షించుకోవాలని, పక్షులు, జంతువులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సామరస్యంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తే.. ప్రభుత్వం పోలీస్ బలగాలతో విద్యార్థులను చాలా కిరాతకంగా ఈడ్చుకుంటూ పోలీస్ వాహనాలలో ఎక్కించుకొని అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టడం గర్హనీయం అన్నారు.
అరెస్టు చేసిన విద్యార్థులని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీ భూముల రక్షణ కోసం యూనివర్సిటీ వద్ద ధర్నాకు బయలుదేరిన సీపీఎం నాయకుల్ని రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం దుర్మార్గమన్నారు.
ఏడో గ్యారెంటీ ఏమైంది..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూముల్ని పేదల సంక్షేమం కోసం కాకుండా కార్పొరేట్ శక్తుల లాభాల కోసం కేటాయించడం, యూనివర్సిటీల భూములు కొల్లగొట్టి రానున్న కాలంలో ప్రభుత్వ విద్యను ప్రశ్నార్ధకం చేయడమేనని ఆరోపించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని యూనివర్సిటీ భూముల రక్షణ కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులను వారికి మద్దతు తెలుపుతున్న సీపీఎం నాయకుల అక్రమ అరెస్టులను ఆపాలని.. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు, దేవదానం,పసుల అంజయ్య, ఢీ కరుణాకర్ రావుల స్వాతి, పార్టీ నాయకులు మల్లారెడ్డి పాషా ఆంజనేయులు దుర్గా నాయక్ కే, శీను మధు యువజన సంఘం నాయకులు ఆది నాగరాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.