Ghatkesar | ఘట్కేసర్, మే 5: శిథిలావస్థకు చేరుకున్న మా గురుకుల విద్యాలయాన్ని అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు ఇంటింటికీ తిరిగి వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలో దశాబ్దాల క్రితం ప్రారంభించిన గురుకుల విద్యాలయం కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరింది. దాన్ని పునరుద్ధరణను పట్టించుకునేవాడు లేకపోవడంతో మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉత్తరాల ఉద్యమం చేపట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కలిసి వేడుకుంటున్నప్పటికీ ఎవరూ స్పందించకపోవడంతో విద్యార్థులు ఈ ఉత్తరాల ఉద్యమం చేపట్టారు. పట్టణంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఉత్తరాలను అందిస్తూ తమ విద్యాలయాన్ని రక్షించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యాలయ పరిరక్షణకు ఘట్కేసర్ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల ప్రజల ప్రభుత్వంపై పోరాటానికి కదలిరావాలని కోరారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఉత్తరాలను పోస్టు చేశారు.