జవహర్‌నగర్, మార్చి 25: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా పొరపాటున నాలుగేళ్ల బాలుడు వేడి నీటిలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఎస్‌హెచ్‌వో సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ బాలాజీనగర్ మార్కెట్ లేన్‌లో భార్య సుమలత, ఇద్దరు కుమారులతో కాటి నర్సింహా నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పిల్లలను చూసేందుకు ఇటీవల సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. సమీపంలోనే ఉండే నర్సింహ సోదరుడు సాయి ఇంటికి ఈ నెల 23వ తేదీన తన మనుమడు బన్నీ(4)ని తీసుకొని పుల్లమ్మ వెళ్లింది. అదే సమయంలో స్నానానికి వేడి నీళ్లు పెట్టిన సాయి కుటుంబసభ్యులు హీటర్ తీసి బకెట్‌ను అక్కడే ఉంచేశారు. పుల్లమ్మతో మాటల్లో పడిపోయారు. ఈ క్రమంలో ఆడుకుంటున్న బన్నీ పొరపాటున వేడి నీటి బకెట్లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు బకెట్లో నుంచి వెంటనే బన్నీని బయటకు తీశారు.
బన్నీని బయటకు తీసి చూసేసరికి అతని ఛాతీ భాగం తీవ్రంగా కాలిపోయింది. దీంతో బన్నీని వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బన్నీ ఇవాళ ఉదయం మరణించాడు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జవహర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడి మరణవార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.