అహ్మదాబాద్ : రానున్న ఐపీఎల్ సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నది. తమ అరంగేట్రం సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచిన గుజరాత్ మరోమారు అదే ఫీట్ పునరావృతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగా తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
రెండుసార్లు వన్డే ప్రపంచకప్ టైటిల్ విజేత అయిన హేడెన్..ఆసీస్ తరఫున 273 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో మూడు ఫార్మాట్లలో కలిపి 15వేలకు పైగా పరుగులు సాధించాడు. హేడెన్ నియామకంపై టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి స్పందిస్తూ ‘మా జట్టు ప్రయాణంలో అతని భాగస్వామ్యం వెలకట్టలేనిది. సుదీర్ఘ అనుభవం యువ క్రికెటర్ల అభివృద్ధికి దోహదపడుతుంది’ అని అన్నాడు.