శాంతియుత మిలియన్ మార్చ్‌కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచే అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ర్యాలీకి అధికారులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. హాస్టళ్లు, ఇనిస్టిట్యూట్లు, నిరుద్యోగుల అడ్డాలపై పోలీసులు నిఘా పెట్టి కట్టడి చేశారు. దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, మలక్‌పేట ప్రాంతంలో ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బయటకు వస్తే అరెస్టులు చేస్తామంటూ హెచ్చరించారు. చైతన్యపురి, సరూర్‌నగర్, నాగోలు పోలీస్స్టేషన్లకు విద్యార్థి నాయకులను తరలించారు.

ఎల్బీనగర్/ మలక్‌పేట/చిక్కడపల్లి, మార్చి 10 : నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరుద్యోగ మిలియన్ మార్చ్‌కు బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య కుమార్ సహా వందలాది మంది నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే కుమార్ సహా సూర్యప్రకాశ్, సాయికుమార్, ఎర్ర దిలీప్‌లను అరెస్టు చేసి నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మలక్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం చౌరస్తాలో ర్యాలీకి యత్నిస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకుడు అశోక్, ప్రత్యూష, ఇంద్రనాయక్, కుమార్ నాయక్, వెంకటేశ్, రవి, ఆకాశ్లతో పాటు వంద మందిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు.
అశోక్‌నగర్‌లో జేఏసీ నేతలు కొడంగల్ రవి కుమార్,శంకర్ నాయక్, రవి కుమార్, బాలకోటి, వెంకటేశ్ తదితరులను ముందస్తుగానే అరెస్టు చేశారు. అరెస్టు చేయడం పై ఉన్న శ్రద్ధ ఉద్యోగుల భర్తీ చేయడం పై ఎందుకు లేదని సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నించారు. ఆందోళన కార్యక్రమానికి ప్రభుత్వం భయపడి జేఏసీ నేతలు అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్‌కి తామే ఇచ్చామని ప్రచారం చేసుకోవడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం నిజంగా ఉద్యోగాలను భర్తీ చేసి ఉంటే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ద్యారానే ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులనే నిర్బంధించడం దారుణమన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి తమను మోసం చేసిందని వారు మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

అబద్ధాలతో కాలం గడుపుతున్నరు
ప్రజాపాలన అని, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి ఉద్యోగాలు ఇవ్వకుండా, నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తూ రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలన చేస్తున్నారు. మా హక్కుల కోసం, ఉద్యోగాల కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో మిలియన్ మార్చ్ చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి అడ్డుకున్నారు. మూడో ఏడాది గడుస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను నిండా మోసం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి, టీజీపీఎస్సీ ప్రక్షాళన వంటి ఎన్నో హామీలను మేనిఫెస్టోలో పెట్టి అబద్ధాలతో కాలం గడుపుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాక 12 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
-భూక్య కుమార్, బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం
నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వంలో చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌తో మిలియన్ మార్చ్ చేస్తుంటే అక్రమ అరెస్టులతో అడ్డుకుంటున్నారు. నిరుద్యోగుల హక్కుల కో సం, ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం పోరాటం, ఉద్యమం ఆగదు. విద్యార్థుల జీవితాలతో చెగాటమాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేప్పే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నది. అరెస్టులతో ఎన్నాళ్లు అణచివేస్తారు.
-అశోక్,నిరుద్యోగ జేఏసీ నాయకుడు
అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన మిలియన్ మార్చ్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అందుకు విరుద్దంగా నిరసనను తెలిపేందుకు సిద్ధ్దపడిన నిరుద్యోగ విద్యార్థులను వారి సమస్యలను తీర్చకుండా వారిని అడ్డుకునేందుకు రూంలో ఉన్న వారిని అరెస్టు చేయడం అన్యాయం.
– కిరణ్ నాయక్,నిరుద్యోగ జేఏసీ నాయకుడు
సీఎంను పాతాళానికి తొక్కుతాం
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలచేసి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్థ, దౌర్భాగ్యమైన సీఎంను ఇప్పుడే చూస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలను ఇచ్చారే తప్ప ఒక్క నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయలేదు. సీఎం రేవంత్‌రెడ్డిని పాతాళానికి తొక్కే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అరెస్టులకు భయపడం. ఉద్యోగాల సాధనకు ఎన్నిసార్లు అయినా అరెస్ట్ అవుతాం.
– ప్రత్యూష,నిరుద్యోగ జేఏసీ నేత

