Hyderabad | పోచారం, మే20 : హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఘట్కేసర్ సమీపంలో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ.23.55 లక్షల విలువైన ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు.
గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో ఘట్కేసర్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన బ్రెజ్జా కారు (KA39M2163)ను ఆపి చెక్ చేయగా.. డిక్కీలోని ఓ ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన 29 సంచులు గుర్తించారు. మొత్తం 58 కిలోల 88 గ్రాములు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.23.55 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ యువకులను గోవింద్ (36), గజానంద్ (21), పవన్ (25), ఆకాశ్ (32), రాహుల్ (31)గా గుర్తించారు. కర్ణాటకలోని బీదర్ నుంచి ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన సుమన్ జైనీ వద్దకు వెళ్లి ఒక కిలో ఎండు గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. పుణేలో ఉంటున్న అభిషేక్‌కు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. కాగా, పట్టుబడ్డ ఐదుగురు యువకుల నుంచి ఎండు గంజాయి, ఐదు మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు.