మేడ్చల్, మే 23 : విద్యుదాఘాతానికి గురై ప్రైవేట్ ఎలక్ర్టిషియన్ మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అత్వెల్లిలో జరిగింది. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్ మున్సిపాలిటీ అత్వెల్లికి చెందిన దుందిగళ్ల లింగం(53) ప్రైవేట్ ఎలక్ర్టిషియన్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అత్వెల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న వెంచర్‌లోని తాత్కాలిక నివాసాలకు కరెంటు రావడం లేదని స్థానికులు ఫోన్ చేయడంతో లింగం అక్కడకు వెళ్లాడు. మీటర్ వద్ద పరిశీలించిన అనంతరం త్రీఫేజ్ కరెంటుకు ఒక ఫేజ్ కరెంటు రావడం లేదని గుర్తించాడు. త్రీఫేజ్ కనెక్షన్ ఇవ్వడం కోసం ఆ స్థలం ప్రహారీని ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో కనెక్షన్ ఇస్తుండగా లింగం కాలు విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరెంటు షాకుతో ట్రాన్స్‌ఫార్మర్‌పైనే కుప్పకూలాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు లింగం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ రూరల్ ఏఈ మౌలాలి ఘటనా స్థలానికి చేరుకొని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. కాగా, ఈ ఘటనపై వివరణ అడగ్గా.. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తున్న సమయంలో కరెంటు ట్రిప్పయిందని తెలిపారు. తమ సిబ్బంది వచ్చి ఫ్యూజ్ వేసే దాకా, ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎలాంటి పనులు చేయవద్దని లింగంను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ పట్టించుకోకుండా ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి విద్యుదాఘాతానికి గురయ్యాడని చెప్పారు.