మేడ్చల్, ఫిబ్రవరి 10: మేడ్చల్ పట్టణంలో (Medchal) ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మెదక్ జిల్లా చిన్నశకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన నునావత్ రమేశ్ మేడ్చల్ పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నారు. రోజువారీ కూలీగా పనిచేస్తున్న ఆయన మద్యానికి బానిసై ఇంట్లో భార్యా పిల్లలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం కూడా మద్యం సేవించిన వచ్చిన రమేశ్.. పిల్లలపై చేసుచేసుకున్నాడు. అడ్డుకున్న భార్యతో గొడవపడ్డాడు. దీంతో ఆమె అతడిని ఇంట్లో బయటకు పంపించింది.
కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో విగత జీవిగా పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
మృతుని శరీరంపై బయటకి కనిపించే గాయాలు పెద్దగా లేవని, మెడపై మాత్రం అక్కడక్కడ గోరు గుర్తులు ఉన్నాయని ఏసీపీ వెంకట్రెడ్డి చెప్పారు. దీంతో అతని భార్యను విచారించగా మద్యం తాగి గొడవ చేస్తుండటంతో ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు పంపించామని చెప్పారని వెల్లడించారు. ఈనేపథ్యంలో అతడు సాధారణంగా మరణించాడా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామ్నారు. పోస్టుమార్టం నివేదికలో విషయం తెలుస్తుందని చెప్పారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించామని, మృతుని భార్య, పెద్ద కూతురుని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.