శామీర్పేట్, మే 8: వెంటాడుతున్న నీటి కటకట (Drinking Water) ఇందిరమ్మ కాలనీ వాసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. నల్లా నీళ్లు రాక త్యాంకర్లతో నీళ్లు కొనలేక పడుతున్న ఆవేశం కట్టలు తెంచుకుంది. కదం తొక్కిన ఇందిరమ్మ కాలనీ వాసులు కాళీ బిందెలతో రోడ్డెక్కారు. ‘ఈ పనికి మాలిన ప్రభుత్వం పాడుగాను’ అంటూ నినాదాలు చేస్తూ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ ప్రజలది దీన పరిస్థితి. గత 20 రోజులుగా మంచి (నల్లా) నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాలనీ వాసులు గురువారం కదం తొక్కారు.
ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం, అధికారుల పాలనపై తీవ్రస్థాయిలో ద్వజమెతారు. ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్ గడి మలక్పేట్లోనే ఎందుకు వస్తున్నదని పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. మిషిన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతున్నదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు. దాదాపు 20 రోజులగా నీళ్ల సమస్య ఉందనన్నారు.
నీటి సమస్యను వివరిస్తే రోజుకో ట్యాంకర్ కాలనీ మొత్తానికి నీటిని పంపి చేతులు దులుపు కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు, ట్యాక్సులు కట్టకపోతే నల్లా కనెక్షన్లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని, నెల రోజుల నుంచి నీరు సరిగా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నీటి సమస్య పరిష్కరించకుంటే ఎంతదూరమైన పోయి ధర్నా చేస్తామని హెచ్చరించారు. నిరసన విషయం తెలుకుని వచ్చిన పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగా రావడం లేదని, వచ్చిన నీళ్లనే సర్దుబాటు చేస్తున్నామని చెప్పారు.