Keesara | కీసర, జూన్ 8: మేడ్చల్ మల్కాజిగిరి కీసరలోని వార్డు కార్యాలయాన్ని కీసర నుంచి మార్చితే సహించేది లేదని పలు రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. వార్డు కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చవద్దంటూ కీసరలోని ప్రధాన చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు పెద్ద ఎత్తున ధర్నా, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత నాయకపు వెంకటేశ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కీసరను ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా కీసరను తీసుకెళ్లి దమ్మాయిగూడ మున్సిపాలిటీలో విలనీం చేసి పెద్ద తప్పు చేశారని అన్నారు. దీనివల్ల కీసరకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వార్డు కార్యాలయాన్ని కీసర నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు స్పందించి వార్డు కార్యాలయం కీసరలోనే ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.