ఘట్కేసర్, మార్చి 25: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చొరవతో ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనులకు నిధులు మంజూరయ్యాయి. అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి పెండింగ్లో ఉన్న ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జి పనుల నిమిత్తం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.50లక్షలను మంజూరు చేశారు. దీనిపట్ల ఘట్కేసర్ జేఏసీ, మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
పెండింగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మాజీ మంత్రి మల్లారెడ్డినికి కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మల్లారెడ్డి కలిసి సమస్యను వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన భట్టి విక్రమార్క.. రూ.50 లక్షలను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
నిధులు మంజూరు చేయడం పట్ల భట్టి విక్రమార్క, మల్లారెడ్డికి ఘట్కేసర్ జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, సభ్యులు, మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి మల్లారెడ్డి చొరవతోనే బ్రిడ్జ్ నిర్మాణం 80 శాతం పూర్తయిందని తెలిపారు. తన సొంత నిధులను కూడా బ్రిడ్జ్ నిర్మాణానికి కేటాయించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం కొనియాడారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంతవరకు సహకారం అందిస్తారని జేఏసీ, బీఆర్ఎస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.