మేడ్చల్ కలెక్టరట్, మార్చి 24: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధికారుల తీరు! నాలాలో చెత్త చేరడంతో డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి వాసన వస్తుండటంతో.. ఆ చెత్తను తీసిన అధికారులు రోడ్డుపైనే అడ్డంగా పారబోసి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటివరకు వాసనతోనే ఇబ్బంది పడ్డ స్థానికులు.. ఇప్పుడు ఆ మురుగులో నుంచి వెళ్లాల్సి వస్తుంది.
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్ మీదుగా మురుగు నీళ్లు పారే నాలాలో కొంతకాలంగా చెత్త చేరడంతో, డ్రైనేజీ నీళ్లు పారడడం లేదు. దీంతో మురుగు నీరు నిలిచిపోయి వాసన రావడంతో ఆ కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన మున్సిపల్ సిబ్బంది వెంటనే నాలాలో నుంచి చెత్తను తొలగించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తీసిన చెత్తను మాత్రం అక్కడే రోడ్డుపై అడ్డంగా పారబోసి వెళ్లిపోయారు. దీంతో కాలనీవాసులతో పాటు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వాసనతో పాటు, బురదలో నుంచి వెళ్లాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చెత్త నాలా లో ఉన్నప్పుడే బాగుండేది అని స్థానికులు అంటున్నారు. అధికారం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇదే పరిస్థితుల్లో మీరు ఇంట్లో నివసిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మురుగు నీటి చెత్తను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.