Congress Leaders | శామీర్ పేట, ఏప్రిల్ 7 : సీఎం రేవంత్ రెడ్డే కాదు ఆ పార్టీ నేతలు సైతం గుండాగిరి చలాయిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ మరిచి వ్యవహరిస్తున్నారు. శామీర్పేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు ఆధ్వర్యంలో కాంగ్రెస్ మూకలు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శనివారం శామీర్ పేట వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై నర్సింలు యాదవ్ ఆధ్వర్యంలో పది మందికిపైగా కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ఫ్లెక్సీ, చిత్రపటాలను చించి వేశారు. అధికారంలో కాంగ్రెస్ ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఫొటో సహకార సంఘంలో ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోనే ఉండాలంటూ అద్దాలపై ఉన్న కేసీఆర్, నాటి ప్రభుత్వ పథకాల స్టిక్కర్స్, ఫ్లెక్సీ లు తొలగించారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు.
సహకార సంఘం కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఏఎంసీ చైర్మన్ బొమ్మల పల్లి నర్సింలు యాదవ్, కాంగ్రెస్ పార్టీ శామీర్ పేట్ మండల అధ్యక్షుడు వైఎస్ గౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రమేష్, మాజీ ఎంపీటీసీ సాయిబాబు, శామీర్ పేట్ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయులు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బండి శ్రీకర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, నాగరాజు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.