జవహర్‌నగర్, మార్చి 10: ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్‌లో ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెస్ నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన చదువు చెప్పడం ఏమో గానీ.. మౌలిక వసతులను కూడా సరిగ్గా కల్పించడం లేదు. కనీసం బాత్రూంలను కూడా శుభ్రం చేయించడం లేదు. జవహర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్‌ను పట్టించుకోకపోవడంతో అపరిశుభ్రంగా మారి దుర్వాసన రావడంతో ముక్కుమూసుకొని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అపరిశుభ్ర టాయిలెట్స్‌లోకి వెళ్లడం వల్ల విద్యార్థులు అనారోగ్యబారిన పడుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిపై బీజేవైఎం నాయకులు మండిపడ్డారు. సోమవారం నాడు పాఠశాలను సందర్శించిన వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అపరిశుభ్ర టాయిలెట్స్‌తో విద్యార్థులు అనారోగ్యానికి గురికావాల్సిందేనా? ప్రజాపాలనలో విద్యార్థుల జీవితాలను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని జవహర్‌నగర్ బీజేవైఎం నాయకులు మండిపడ్డారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని ఫైరింగ్‌కట్ట, జవహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం బీజేవైఎం అధ్యక్షుడు సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పరిశీలించి మౌలిక వసతుల కల్పనపై ప్రధానోపాధ్యాయులతో కలిసి చర్చించారు.
ఈ సందర్భంగా సందీప్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజితో భారత్ అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ పాఠశాలలు అందుకు భిన్నంగా ఉన్నాయనడానికి అపరిశుభ్రమైన టాయిలెట్స్ నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే ప్రజా ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్కారు పాఠశాలలో మౌలిక వసతులు కరవయ్యాయని, విద్యాబుద్ధులు, క్రమశిక్షణ నేర్చుకునే దేవాలయంలాంటి పాఠశాలలే ఇలాంటి పరిస్థతిలో ఉంటే విద్యార్థులకు చదువు ఎలా వంటపడుతుందని, ఆడబిడ్డలు టాయిలెట్స్‌కు వెళ్లాలంటే ఎలా అంటూ ఆగ్రహించారు. విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.
అనంతరం పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల విషయమై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ప్రధాన కార్యదర్శి చందు కురుమ, నాయకులు రాకేష్, రాహుల్‌సింగ్, రవి, ఇలై కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.