cheeriyal Double bed room homes | కీసర, మే 29 : దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల్ డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలతో నివాసితులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీసర మండలం చీర్యాల్ గ్రామంలోని నిరుపేదలకు 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి లబ్ధిదారులకు కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఆ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకు అక్కడ కనీస వసతి సదుపాయాలను కల్పించాలన్న సోయి లేకుండా పోయిందన్న విమర్శలు ఆ కాలనీవాసుల నుంచి వినిపిస్తున్నాయి.
ఒకవైపు నీటి కొరత, వీధిదీపాలు, సీసీ రోడ్డులు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రోడ్లపై పారుతున్న మురుగునీటి కంపు కాలనీవాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా రాత్రి సమయాల్లో పాములు, విషపు పురుగులు ఇండ్లలోకి వచ్చి చేరుతుండటంతో ఆ కాలనీవాసులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇండ్ల మధ్యలో ఉన్న రోడ్లన్ని బురదమయంగా మారిపోవడంతో అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు రోడ్ల మీద స్వైరవిహరం చేయడం, కంపు దుర్వాసన, దోమల బెడదలు ఎక్కువ కావడంతో పలు రోగాలకు గురై ఆ కాలనీవాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
చీర్యాల్లోని డబుల్ బెడ్ రూం కాలనీలో నెలకొన్న సమస్యల మీద జిల్లా అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం కాలనీ విషయంలో అధికారులు చిన్నచూపు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా రొక్కాడితేనే గాని డొక్కాడని దుర్భర పరిస్థితి మధ్య జీవనం గడుపుతున్నారు. కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యతోపాటు పారిశుద్ధ్యం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి డబుల్ బెడ్రూం కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
PM Modi | ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సిందూర్ తగిన సమాధానం : ప్రధాని మోదీ
Sunkishala | సిటీకి సుంకిశాలే శరణ్యం.. కేసీఆర్ దిశలోనే కాంగ్రెస్ సర్కారు
Navy plane Crashes | ఘోర ప్రమాదం.. కూలిన నేవీ విమానం