Chanda Nagar | కొండాపూర్, మే 23 : హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షానికే రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ తూతూ మంత్రంగా పనులు చేపట్టి వదిలేస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదంటూ చందానగర్ డివిజన్ కేఎస్ఆర్ ఎన్క్లేవ్ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని కేఎస్ఆర్ ఎన్‌క్లేవ్‌లో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో చెరువుల్లా మారుతున్నాయి. ఈ సమస్యపై ఎంతోకాలంగా కాలనీ వాసులు అధికారులకు మొర పెట్టుకుంటున్నా లాభం లేకుండా పోయింది. వరద నీరు చేరినప్పుడు నీరు తోడేసి చేతులు దులుపుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలంటూ అధికారులను కోరుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరుతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, చిన్నపిల్లలు రోడ్ల పై నడిచేందుకు భయపడే పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకుని వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.